మే నెలాఖరికి పనులు పూర్తి కావాలి
AP39TV న్యూస్ ,కూడేరు:
కూడేరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు- నేడు పథకం కింద చేపడుతున్న అదనపు గదుల నిర్మాణపు పనులను మే నెలాఖరికి పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ఈ భాగ్యరాజు మండల సిబ్బందికి ఆదేశించారు. శనివారం ఆయన కూడేరు హైస్కూల్లో జరుగుతున్న గదుల నిర్మాణపు పనులను పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని ఏఈ శ్రీనివాసులకు సూచించారు. ముందు భాగాన మంచి డిజైన్ తో నిర్మాణం చేయించి భవనం ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని తెలియజేశారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైస్కూల్లో సుమారు రూ. 80 లక్షలతో గదుల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరి కిరణ్ ,పిఆర్ వర్క్ ఇన్స్పెక్టర్ గురు రాజారావు తదితరులు పాల్గొన్నారు.