ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అనంత
దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్
– ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అనంత
అనంతపురం, ఏప్రిల్ 22 :
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్ పర్వదినం అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం ‘ఈద్ ఉల్ ఫితర్’ ముగిసిన శుభవేళ శనివారం నగరంలోని ఈద్గా మైదానం వద్ద ముస్లిం సోదరులను కలిసి ఆయనతో పాటు ఎంపీ గోరంట్ల మాధవ్, మేయర్ మహమ్మద్ వసీం శుభాకాంక్షలు తెలియజేశారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. అల్లా దీవెనలతో సమస్త మానవాళికి సకల శుభాలు కలగాలన్నారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని, రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడన్నారు. రంజాన్ మాసం అంతా ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడిరదని చెప్పారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో రంజాన్ పండుగ ప్రత్యేకంగా నిలుస్తుందని తెలిపారు. ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమన్నారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌస్ బేగ్, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు కాగజ్ ఘర్ రిజ్వాన్, మైనార్టీ జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్, పలువురు కార్పొరేటర్లు, వైయస్సార్ సీపీ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.